: పతకాన్ని తిరస్కరిస్తావా?... సరితా దేవిపై 'ఐబా' ఆగ్రహం
ఆసియా క్రీడల్లో కాంస్యపతకాన్ని తిరస్కరించిన బాక్సర్ సరితాదేవిపై ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ బాక్సర్ సరితాదేవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆసియా క్రీడల తరువాత ఐబా నిర్ణయం ప్రకటించనుంది. సెమీ ఫైనల్ పోరులో మెరుగైన ప్రదర్శన చేసిన సరితాదేవి ఓటమిపై విస్మయం వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరిగిందంటూ రిఫరీలకు మొరపెట్టుకుంది. ఆసియా క్రీడల నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో సరితాదేవి తనకు వచ్చిన కాంస్య పతకాన్ని వదిలేసి వెళ్లిపోయింది. నిజానికి సరితాదేవి విజయం సాధించిందని అందరూ భావించినప్పటికీ, రిఫరీలు ఆమె ఓటమిపాలైనట్టు ప్రకటించారు. ఆమె ఎందుకు ఓటమి చెందిందనే విషయాన్ని రిఫరీలు ప్రకటించకపోవడం విశేషం.