: హైవే కాల్పుల కేసులో అదుపులో ఉన్న సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్ల పాత్ర ఏంటి?
కృష్ణాజిల్లా పెద అవుటపల్లి జాతీయ రహదారిపై సంచలనం సృష్టించిన కాల్పుల కేసులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ సీఐ మురళీకృష్ణ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 24న కృష్ణాజిల్లా పెద అవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి పెద మారయ్య, చిన మారయ్యలను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మారం శ్రీనివాస్, గణేష్ సహా ఆరుగురు నిందితులుగా ఉన్నారు. దీంతో, వీరిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హతుల బంధువులు ఈ హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. దుర్గారావు హత్యాకేసులో నిందితులైన హతులు ముగ్గురికీ రక్షణ కల్పించాలని ముందుగానే వారి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వారి అభ్యర్థన మేరకు ముగ్గురు పోలీసులను ఎస్కార్టులుగా పంపినట్టు సమాచారం. అయితే, ఎస్కార్టులు హత్య జరిగిన సమయంలో ఎక్కడున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నడి రోడ్డుపై, పట్టపగలు కాల్పులు జరుగుతుంటే ఎస్కార్టులు ఏమయ్యారంటూ హతుల బంధువులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కైన తరువాతే తమ వారిని హత్య చేశారంటూ వారు బాహాటంగా ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ రోజు జరిగిన సంఘటనలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సీఐ సహా ముగ్గురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ కేసు చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.