: 'గోవిందుడు'తో కొత్త ఇమేజ్ సొంతం చేసుకున్న చెర్రీ: సినిమా రివ్యూ!


ఇప్పటివరకు రామ్ చరణ్ ను ఓ లవర్ బాయ్ గానో, యాక్షన్ హీరోగానో చూశాం. మాస్ హీరో ఇమేజ్ తో నేటివరకు ప్రస్థానం సాగించిన చెర్రీ కెరీర్లో 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇది క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ సినిమా! ఆయన చిత్రాల్లో కుటుంబ విలువలదే లీడ్ రోల్. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాలను హృద్యంగా తెరకెక్కించడంలో వంశీ దిట్ట. మరి ఆయన దర్శకత్వంలో నటించిన హీరోకు ఫ్యామిలీ హీరో ఇమేజ్ లభించడం సహజం. గతంలో మహేశ్ బాబు (మురారి), నాగార్జున (నిన్నే పెళ్ళాడతా) వంశీ దర్శకత్వంలో నటించిన తర్వాత కొన్నాళ్ళపాటు సదరు 'ఫ్యామిలీ' ట్యాగ్ తప్పించుకోలేకపోయారు. తాజాగా, రామ్ చరణ్-కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కుటుంబ కథా చిత్రాలకు అపజయం ఉండదన్నది సినీ వర్గాల నిశ్చిత అభిప్రాయం. ప్రేక్షకుల మాట కూడా అదేనని ఈ సినిమా ఓపెనింగ్స్ చెబుతున్నాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ కొత్త ఇమేజ్ సొంతం చేసుకున్నట్టేనని సినీ పండితులంటున్నారు. ఇక, సినిమా విషయానికొద్దాం. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ తరహాలో ఎన్నో సినిమాలు వచ్చినా 'గోవిందుడు..' కాన్సెప్ట్ వాటికి విభిన్నం. 'ఎవరి పనులు వారు చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి'... ఫస్ట్ షాట్ నుంచి శుభం కార్డు దాకా సినిమాను నడిపించింది ఈ సూత్రమే. స్టోరీపై ఓ లుక్కేద్దాం అభిరామ్ (రామ్ చరణ్) లండన్ లో పుట్టిపెరిగిన ఆధునిక యువకుడు. భారతదేశ ఆచార వ్యవహారాలంటే ఎంతో గౌరవం. తండ్రి చంద్రశేఖర్ (రహమాన్) ద్వారా భారత్ లో ఉన్న తన తాత బాలరాజు (ప్రకాశ్ రాజ్) గురించి తెలుసుకుంటాడు. తాతకు దూరమయ్యానన్న వేదనతో తండ్రి కుమిలిపోతుండడం అభిరామ్ ను కలచివేస్తుంది. చంద్రశేఖర్ బాధకు కారణం ఉంది. తండ్రిని ధిక్కరించి, ప్రేయసి (భానుశ్రీ మెహ్రా)ని పెళ్ళి చేసుకుని లండన్ వచ్చేస్తాడు. అప్పటినుంచి అపరాధ భావనతో సతమతమవుతుంటాడు. దీంతో, తండ్రిని, తాతను కలపాలని నిర్ణయించుకుంటాడు అభిరామ్. భారత్ వచ్చి తానెవరో చెప్పకుండా బాలరాజు కుటుంబంలో ప్రవేశిస్తాడు (ఇక్కడ 'అత్తారింటికి దారేది' ఛాయలు కనిపిస్తాయి). అక్కడి నుంచి డ్రామా సాగుతుంది. తెలుగు సినిమాలు మాగ్జిమం ఎలా ముగుస్తాయో ఇదీ అంతే. తాతను తండ్రిని అభిరామ్ ఎలా కలిపాడన్నది క్లైమాక్స్. చెర్రీ ఓకే! నటన పరంగా రామ్ చరణ్ కు ఫుల్ మార్కులు ఇవ్వొచ్చు. సున్నితమైన భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించాడు. అటు, సెంటిమెంటు ఒలికించడంతో పాటు, ఇటు అందాల కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ పండించాడు. ఫైట్లు, పాటల్లో తనదైన ముద్ర కనిపించింది. మరదలు సత్యగా కనిపించిన కాజల్, చెర్రీల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌటైంది. ప్రకాశ్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 'పాత్రకు పూర్తి న్యాయం చేయడం ఆయనకే చెల్లు' అనేలా నటించాడు. ఆయనకు జోడీగా జయసుధ..! చెప్పదేముంది... సెంటిమెంటు సీన్లు బాగా రక్తికట్టాయి. విలన్ పాత్రధారులు కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, ఆదర్శ్ తమ వంతు న్యాయం చేకూర్చారు. కామెడీ ట్రాక్ పెద్దగా లేదు. అయితే, స్క్రీన్ ప్లేతో ఆ లోటు కనిపించనీయలేదు కృష్ణవంశీ. తన 'క్రియేటివ్ డైరక్టర్' ట్యాగ్ కు ఎక్కడా భంగం కలగనీయకుండా కథనం నడిపించాడు. ఇక, యువన్ శంకర్ రాజా సంగీతం, సమీర్ రెడ్డి కెమెరా నైపుణ్యం సినిమాకు ప్లస్ అయ్యాయి. యువన్ నేపథ్య సంగీతంతో సీన్లు చక్కగా ఎలివేట్ అయ్యాయి. ఈ సిినిమాను ఫ్యాన్స్ కు దసరా కానుక అని చెప్పుకోవచ్చు.

  • Loading...

More Telugu News