: మోడీ అమెరికా పర్యటన... పెట్టుబడుల తుపాన్ ను సృష్టిస్తోంది!
ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటన, భారత్ ను పెట్టుబడుల ప్రవాహంతో ముంచెత్తనుంది. అమెరికా పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన ఇంకా స్వదేశీ గడ్డపై కాలు కూడా మోపలేదు, అప్పుడే పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. తన అమెరికా పర్యటనలో భాగంగా మోడీ, అమెరికన్ కార్పోరేట్ దిగ్గజాలతో జరిపిన విందు సమావేశం మంచి ఫలితాలనే ఇస్తోంది. విందు సమావేశం జరుగుతున్న సమయంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారుగా ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ రాక్, రానున్న ఏడాది కాలంలో 6 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్ కు ప్రకటించింది. ఆ సంస్థ సీఈఓ లారెన్స్ డిఫింక్, ఈ మేరకు ప్రధానికి హామీ ఇచ్చారు. ఆ మరుక్షణమే 5 లక్షల డాలర్ల పెట్టుబడితో భారత్ లో ఓ ఔషధ తయారీ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు మరో కంపెనీ సీఈఓ ప్రకటించారట. విందు భేటీలోనే ఈ మేర ప్రతిపాదనలు వెల్లువెత్తేలా చేయడంతో మోడీ దాదాపు అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాన్నే సాధించినట్లు లెక్క. అయితే, మోడీతో జరిగిన విందు భేటీలో మొత్తం 17 కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరి నుంచే ఈ మేర పెట్టుబడులు వస్తే, మిగిలిన వారి నుంచి మరింత భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే, మోడీ అమెరికా పర్యటన, భారత్ ను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో తడిపి ముద్ద చేయడం ఖాయమే.