: తమిళ ‘అమ్మ’కు జైలుతో కన్నడ ‘అమ్మ’కు డిమాండ్!
పురుచ్చితలైవి ‘అమ్మ’ జయలలితకు జైలు శిక్ష, కన్నడ ‘అమ్మ’ రాగిణి ద్వివేదికి మంచి డిమాండ్ ను తెచ్చిపెట్టింది. కన్నడ ’అమ్మ’ అంటే... కన్నడ టాప్ హీరోయిన్ రాగిణి ద్వివేదీ ముఖ్య పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్న బహుభాషా చలన చిత్రం. జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది హిందీ, తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ అగ్రశ్రేణి నటి రాగిణి ద్వవేది, జయలలిత పాత్ర పోషిస్తున్నారు. ‘మై హూ రజనీకాంత్’ చిత్ర దర్శకుడు ఫైజల్ సైఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఎక్కడ తమ ‘అమ్మ’ను కించపరిచేలా ఉంటుందోనన్న అనుమానంతో తమిళ తంబీలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారట. అయితే జయలలితను కించపరిచే సన్నివేశాలేవీ ఇందులో లేవని రాగిణి తేల్చిచెబుతోంది. అంతేకాక ఈ చిత్రం జయలలిత జీవిత చరిత్ర కాదని, కథాంశంలోని ప్రధాన పాత్ర ఆమె ఇతివృత్తాన్ని పోలి ఉంటుందని వివరిస్తోంది. మరో పదిహేను రోజుల షూటింగ్ తో చిత్ర నిర్మాణం పూర్తి కానుందని సమాచారం. జయలలితకు జైలు శిక్ష పడిన సమయంలోనే ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రదర్శన హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతున్నారట. ఇక సరిగ్గా చిత్ర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో జయలలిత జైలుపాలైన నేపథ్యంలో తన చిత్రానికి ఎలాంటి క్లైమాక్స్ ఇవ్వాలన్న అంశంపై ఫైజల్ మల్లగుల్లాలు పడుతున్నారట.