: కేరళ బ్లాస్టర్స్ జెర్సీని ఆవిష్కరించిన సచిన్
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ వ్యాపకాలతో బాగా బిజీ అయ్యాడు. ఇండియన్ సూపర్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సాకర్ పోటీల్లో కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సచిన్, తాజాగా, తన జట్టు అధికారిక గీతాన్ని, జెర్సీని ఆవిష్కరించాడు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ, తమ జెర్సీ పసుపు రంగులో ఉంటుందని, ఆ రంగు పట్టుదలకు, విశ్వాసానికి సూచిక అని తెలిపాడు. ఈ లీగ్ ద్వారా భారత్ లో క్రీడా సంస్కృతి అలవడుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. కాగా, సచిన్ జట్టు అధికారిక గీతానికి బాణీలు అందించింది టాలీవుడ్ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖే. అంతర్జాతీయ సాకర్ ఆటగాళ్ళు పాల్గొంటున్న ఈ లీగ్ అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనుంది.