: బీహార్ మంత్రిపై దాడి... సజీవ దహనం చేసేందుకు యత్నం
బీహార్ లో సోమవారం రాత్రి భీకర దాడి చోటుచేసుకుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వసతుల లేమిపై విరుచుకుపడ్డ స్థానికులు ససారంలో ప్రభుత్వ అధికారులపై దాడి చేయడంతో పాటు, ఆ రాష్ట్ర మంత్రిని సజీవ దహనం చేసేందుకు యత్నించారు. దీంతో వేదిక కింద దాదాపు 2 గంటల పాటు దాక్కున్న సదరు కేబినెట్ మంత్రి బతుకు జీవుడా అంటూ వ్యక్తిగత సిబ్బంది సహాయంతో బయటపడ్డారు. అయితే ఆయన అధికార వాహనంపై స్థానికులు పెట్రోల్ పోసి, నిప్పు పెట్టారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత కాని ఆ కేబినెట్ మంత్రి మీడియా ముందుకు వచ్చి తనపై దాడి జరిగిన వైనాన్ని వెల్లడించలేకపోయారు. అయితే స్థానికులు దాడి జరుపుతున్న సమయంలో రోహ్ తక్ జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉండట గమనార్హం. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ససారంలోని ప్రముఖ తారాచండీ ఆలయంలో సోమవారం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు జరిగాయి. స్వతహాగా కళాకారుడైన రాష్ట్ర కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బిహారీ కార్యక్రమంలో భాగంగా కొన్ని భక్తి గీతాలు ఆలపించారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లు సరిగా లేవంటూ కొందరు స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి కుర్చీలను విసిరేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన స్థానికులు వేదికపై విరుచుకుపడ్డారు. రాళ్లు విసురుతూ, రెచ్చిపోయిన యువకులు మంత్రి వాహనానికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో వేదిక కింద దాదాపు రెండు గంటల పాటు దాక్కున్న మంత్రి తన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఎలాగోలా బయటపడి ఆస్పత్రికి చేరారు. అప్పటికే స్వల్పగాయాలపాలైన ఆయన స్థానికుల దాడితో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షాక్ నుంచి తేరుకునేందుకు ఆయనకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన మంత్రి, తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందంటూ ఆరోపించారు. విచక్షణ కోల్పోయిన యువకులు, కిరోసిన్ బాటిళ్లు చేతబట్టి, తనకోసం గాలించడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు. దీనిపై 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.