: ఐదు నిమిషాలు టైమివ్వండి... జయపై ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరూపిస్తా: రామ్ జెఠ్మలానీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ వ్యవహారంలో ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టులో జయ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరపడం తెలిసిందే. తొలుత ఆ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజు వాల్మీకి జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు. దీంతో, జెఠ్మలానీ తాను ఈ కేసు కోసమే లండన్ నుంచి భారత్ వచ్చానని, ఈ రోజే (మంగళవారం) విచారణ జరగాలని వాదించారు. కనీసం రేపు (బుధవారం) అయినా విచారణ జరిగేలా చూడాలని కోరారు. తనకు ఐదు నిమిషాలు చాలని, జయపై వచ్చిన ఆరోపణలను అవాస్తవాలని నిరూపించగలనని పేర్కొన్నారు. అయితే, కోర్టుకు దసరా సెలవులని, ప్రస్తుతం విచారణ జరపలేమని న్యాయమూర్తి బదులిచ్చారు. ఈ విషయమై హైకోర్టు రిజిస్ట్రార్ ను కలవాలని సూచించారు. దీంతో, జెఠ్మలానీ సహాయకులు రిజిస్ట్రార్ ను కలిశారు. అటు, అన్నా డీఎంకే నేతలు కూడా జయ బెయిల్ పిటిషన్ పై వెంటనే విచారణ జరిపించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా సూచనలతో, ప్రత్యేక ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపడుతుందని అప్పటికప్పుడు ఆదేశాలు వెలువడ్డాయి.