: సాటి వ్యక్తిని ప్రాణాలు పోయే విధంగా కొట్టి నూడుల్స్ ఆర్డర్ చేశాడు!
నూడుల్స్ షాపుకు వెళ్ళిన ఓ వ్యక్తి కుర్చీ విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు. జపాన్ లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే... టోక్యోలో హిసామా కిటాజియో (49) అనే వ్యక్తి నూడుల్స్ తిందామని ఓ రెస్టారెంటుకు వెళ్ళాడు. అక్కడ అప్పటికే షినిచిరో ఇమానిషి (37) అనే భారీకాయుడు కూర్చుని ఉన్నాడు. అతడు కాళ్ళుపెట్టుకుని ఉన్న కుర్చీని లాగడమే కిటాజిమా చేసిన పొరబాటు. వెంటనే పైకిలేచిన ఇమానిషి తీవ్ర ఆగ్రహంతో కిటాజిమాపైకి దూకాడు. అతడిని చితకబాదాడు. అనంతరం, అతడి పరిస్థితి ఏమిటన్నది కూడా పట్టించుకోకుండా ఓ బౌల్ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇమానిషిని అరెస్టు చేశారు. ఇక, తీవ్రగాయాలపాలైన కిటాజిమా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు.