: టాయిలెట్లో ఎంఏ పాఠాలు!
ప్రభుత్వ కళాశాలల దుస్థితికి ఇంతకన్నా ఘనమైన నిదర్శనం మరొకటి ఉండదేమో! ఉత్తరప్రదేశ్ లోని గుర్గావ్ లో ఉన్న ప్రభుత్వ పీజీ కళాశాలలో టాయిలెట్ ను క్లాస్ రూంగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండేళ్ళ నుంచి ఆ టాయిలెట్లో ఎంఏ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. న్యూ రైల్వే రోడ్డులోని ద్రోణాచార్య ప్రభుత్వ కళాశాలకు వెళ్ళి చూస్తే... టాయిలెట్లో విద్యార్థులు నేలపై కూర్చుని పాఠాలు వింటూ కనిపిస్తారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ ఆర్కే యాదవ్ మాట్లాడుతూ, తగినంతగా ప్రభుత్వ నిధులు అందడంలేదని, అందుకే, కొత్త క్లాస్ రూంలు నిర్మించలేకపోతున్నామని వాపోయారు. విద్యార్థుల సంఖ్యను బట్టి మరో 25 క్లాస్ రూంలు కావాల్సి ఉండగా, 12 క్లాస్ రూంలకే అనుమతి లభించిందని, వాటికి కూడా ఇంకా నిధులు విడుదల కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో, తాము టాయిలెట్ ను క్లాస్ రూంగా మార్చుకున్నామని తెలిపారు. తమ అవస్థలపై ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి స్పందిస్తూ, ఎంతో వేదన కలిగిస్తోందని అన్నాడు. అయితే, బయట ఎండలో కూర్చోవడం కంటే టాయిలెట్టే బెటరని పేర్కొన్నాడు.