: తమిళనాడుకు జయలలిత?
అక్రమాస్తుల కేసులలో దోషిగా తేలిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు దాదాపు మార్గం సుగమమైంది. రూ.66.65 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టిన జయలలితను సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా దోషిగా ప్రకటిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన మరుక్షణమే జయలలితను బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు జయలలిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణను కర్ణాటక హైకోర్టులోని వెకేషన్ బెంచ్ అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జయలలితను తమిళనాడుకు తరలించేందుకు పన్నీర్ సెల్వం ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టినట్లు సమాచారం. కేసులో నిందితులను దోషులుగా ప్రకటించే వరకే కోర్టు పరిధి సమాప్తమవుతుందని సెక్షన్ 3 ఆఫ్ ప్రిజన్స్ యాక్ట్, 1984 స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం జైళ్ల శాఖ ఐజీ ఆర్డర్ తో దోషుల కారాగారాన్ని మార్చే అవకాశముంది. దీని ప్రకారం తమిళనాడు జైళ్ల శాఖ ఐజీ జారీ ఉత్తర్వులతో జయలలితను తమిళనాడుకు తరలించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేకాక, సదరు చట్టం ప్రకారం జయలలితను జైల్లోనే నిర్బంధించాల్సిన అవసరం కూడా ఏమీ లేదట. తన నివాసంలోనే జయలలిత జైలు శిక్షను అనుభవించే వెసులుబాటు కూడా ఉందట. ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే, నేడో, రేపో జయలలిత పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారం నుంచి బయటపడటం ఖాయంగానే కనిపిస్తోంది.