: హురియత్ నేతలతో మా భేటీ తప్పే: పాక్
కాశ్మీరీ వేర్పాటువాదులైన హురియత్ నేతలతో తమ దేశ రాయబారి జరిపిన భేటీ తప్పేనని పాకిస్తాన్ అంగీకరించింది. ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరగనున్న కీలక చర్చలకు ముందుగా ఆ భేటీ జరగడం సరికాదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు విదేశీ విధానంపై సలహాదారుడు సర్తాజ్ అజీజ్ అన్నారు. భారత టీవీ చానెల్ కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. హురియత్ నేతలతో భేటీని పాక్ రాయబారి జరిపి ఉండాల్సింది కాదని కూడా అజీజ్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మోడీ, షరీఫ్ ల మధ్య చర్చల్లో ఓ మంచి అవకాశాన్ని ఆ భేటీ దూరం చేసిందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య కాశ్మీర్ కూడా ఓ సమస్యగానే ఉన్న నేపథ్యంలో హురియత్ నేతలతో తాము 30 ఏళ్లుగా చర్చలు జరుపుతూనే ఉన్నామన్న అజీజ్, ఈ ఒక్క అంశం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా దెబ్బతీయలేదని ఆయన అభిప్రాయపడ్డారు.