: ఒబామా విందును మంచినీళ్లతో సరిపెట్టిన మోడీ!
అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో సకల హంగులు, ఆర్భాటాలతో పాటు అన్ని రకాల రుచులతో ఆ దేశాధ్యక్షుడు ఆఫర్ చేసే విందు అంటే, ప్రపంచ దేశాల అధినేతలు అర్రులు చాచడం చూస్తున్నదే. అయితే అందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం మినహాయింపు. ఎందుకంటే, సోమవారం అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా ఇచ్చిన విందును కేవలం మంచి నీళ్లతోనే మోడీ ముగించేశారు. వివిధ దేశాల రుచులు, బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, చేపలు తదితరాలతో పాటు రెడ్ వైన్ ను విందులో అతిథులకు అందుబాటులో ఉంచారు. అయితే, నవరాత్రి ఉపవాస దీక్షలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కేవలం, గోరువెచ్చని నీటిని సేవించి, తన విందు ముగిసిందని చెప్పేశారు. ఆరు రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉన్న మోడీ, అమెరికా పర్యటనలో తనదైన ప్రసంగాల తీరును అద్వితీయంగా కొనసాగిస్తున్నారు. సోమవారం అమెరికా కార్పోరేట్ దిగ్గజాలతో భేటీ సందర్భంగా ఆయనతో షేక్ హ్యాండ్ కలిపిన పలువురు ప్రముఖులు, మోడీ చేతి బలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు వారం పాటుగా మంచి నీళ్లతోనే సరిపెడుతున్న మోడీ శరీరంలో ఏమాత్రం నీరసం కనిపించడం లేదని వారు ప్రశంసల వర్షం కురిపించారు.