: ఆల్ ఖైదాను భారత ముస్లింలు ఓడిస్తారు: మోడీ
భారతీయ ముస్లింల వ్యక్తిత్వంపై ఇదివరకే ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని నరేంద్ర మోడీ, మరోమారు వారి ఔన్నత్యాన్ని కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఖైదా తీవ్రవాదాన్ని భారత ముస్లింలు ఓడిస్తారని ఆయన అన్నారు. ఉగ్రవాదం భారత్ లో పుట్టింది కాదన్న ఆయన, సుదూర తీరాల నుంచి అది భారత్ కు ఎగుమతి అయ్యిందని వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ, సోమవారం విదేశీ వ్యవహారాలపై మాట్లాడిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ముస్లిం జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ కు ఇప్పటికీ అహింసనే ప్రధాన ఆయుధంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని మానవత్వానికి శత్రువుగా అభివర్ణించిన మోడీ, దానిని రూపుమాపేందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరు సాగించాల్సి ఉందన్నారు. 40 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తాము చేస్తున్న యత్నాలు ఏమాత్రం ఫలించడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే భారతీయ ముస్లింలు మాత్రం ఆల్ ఖైదాను ఓడించి తీరతారని ప్రకటించారు.