: ‘దీపావళి’ కోసం ఈ-కామర్స్ దిగ్గజాల ఖర్చు... రూ.200 కోట్లు!
భారతీయుల ప్రధాన పండుగ దీపావళి సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు వస్తు తయారీ కంపెనీలతో పాటు మార్కెటింగ్, రీటెయిల్ తరహా సంస్థలు కూడా భారీగా ఖర్చు చేస్తాయి. ఎందుకంటే, ఈ సీజన్ లోనే దాదాపు 40 శాతం అమ్మకాలు పూర్తి అవుతున్నాయి. దీంతో అన్ని రకాల సంస్థలు దీపావళి వస్తుందంటే సర్వం సిద్ధం చేసుకుంటాయి. వినియోగదారులను ఆకట్టుకుని అమ్మకాలు పెంచుకునేందుకు డిస్కౌంట్ల బాటనూ ఎంచుకుంటాయి. తాజాగా ఈ బాటలో ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లతో పాటు అమెజాన్.కామ్ కూడా నడుస్తున్నాయి. దీపావళి కోసం భారీ వ్యయాలకు తెర తీశాయి. దీపావళి సందర్భంగా వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ఈ సంస్థలు ఈ ఏడాది అక్షరాల రూ.200 కోట్లను కేవలం ప్రచారం కోసమే ఖర్చు చేస్తున్నాయట. దీపావళి మార్కెట్ ను కొల్లగొట్టేందుకు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు రూపొందించిన భారీ ప్రణాళిలు తెలుసుకున్న అమెజాన్.కామ్ అధిపతి జెఫ్ బెజోస్ ఉన్నపళంగా భారత్ బయలుదేరారట. భారత్ వచ్చిన ఆయన స్వయంగా ఇక్కడి మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించి, ప్రచారం కోసం భారీ ఎత్తున ఖర్చుకు తన సిబ్బందికి అనుమతులిచ్చేసి వెళ్లారట.