: అటు శ్రీదేవి, ఇటు భూదేవి... వైభోగమంటే ఆయనదే!


ఏటా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో తెలియంది కాదు. టీటీడీ అందుకోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతుంది. అదలా ఉంచితే, స్వామి వారి వైభోగం చూడాలంటే ఈ బ్రహ్మోత్సవాలే తగిన సమయమని భక్తుల నమ్మిక. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వస్తుంటారు. నేడు శ్రీవారు మలయప్పస్వామి రూపంలో శ్రీదేవి, భూదేవి సమేతుడై విహరించారు. నాలుగోరోజు సర్వభూపాల వాహనంపై ఊరేగింపుగా సాగిన స్వామి వారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో, ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ముత్యపుపందిరిలో కూర్చున్న స్వామివారిని స్వర్ణ, వజ్ర, వైఢూర్యాలతో తయారైన ఆభరణాలతో అలంకరించారు. దీపకాంతుల్లో మలయప్పస్వామి శోభ మరింతగా కాంతులీనింది. దానికితోడు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి. తిరుమల వెంకన్నకు తొలిసారిగా ఈ ఉత్సవాలను ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు జరిపించినట్టు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. దాంతో, బ్రహ్మదేవుడి పేరిటే వీటిని నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణంతో ఆరంభమై, చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

  • Loading...

More Telugu News