: లతాజీ పాటలు ఎంతో సాయపడ్డాయంటున్న సచిన్
బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కు గానకోకిల లతా మంగేష్కర్ పాటలంటే ఎంతో ఇష్టం. క్రికెట్ పర్యటనల్లో ఆమె పాటల కలెక్షన్ సచిన్ వెంట ఉండాల్సిందే. సహచరులు బ్యాటింగ్ చేస్తుండగా సచిన్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కనిపించడం ఎన్నోసార్లు టీవీల్లో చూశాం. ఆ సందర్భంగా తాను ఎక్కువగా వినేది లతా మంగేష్కర్ పాటలేనని ఈ ముంబైకర్ తెలిపాడు. లతా మంగేష్కర్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెను ఘనంగా సన్మానించాలని భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా లత ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ముంబైలోని షణ్ముఖానంద హాల్ లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి లతా మంగేష్కర్ తరపున ఆమె సోదరి ఉష హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ, క్రికెట్ లో భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు లతాజీ పాటలు ఎంతగానో సాయపడ్డాయని తెలిపాడు. "లతా దీదీ నా కెరీర్లో పెద్ద పాత్రే పోషించారు. పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఆమె పాటలు వినడం ప్రారంభించాను. మా అమ్మ జోలపాటలకు బదులుగా లత పాడిన పాటలు ఆలపించేది. ఆటలో విఫలమైనప్పుడు ఆమె పాటలు విని కుదుటపడేవాడిని. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.