: మోడీ ముందు షరీఫ్ వెలవెలబోయారు: పాక్ దినపత్రిక సంపాదకీయం
ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ముందు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగం వెలవెలబోయిందని పాక్ దినపత్రిక 'డైలీ టైమ్స్' పేర్కొంది. ఈ మేరకు 'మోడీ ఎట్ ద యూఎన్' పేరిట సంపాదకీయం రాసింది. మోడీ 'ఐరాస'లో ప్రసంగం ద్వారా పాశ్చాత్య దేశాల్లో తన హవాను మరింత దూకుడుగా కొనసాగించారని అభిప్రాయపడింది. ఆకట్టుకోవడంలో మోడీదే పైచేయిగా కనిపించిందని, షరీఫ్ ఆ విషయంలో విఫలమయ్యారని విమర్శించింది. వేదకాలం నాటి విషయాలను స్పృశిస్తూ మోడీ ప్రసంగం ఆరంభించారని, వేద సంస్కృతిని ప్రతిబింబించేలా ఉపన్యాసం సాగించారని 'డైలీ టైమ్స్' పేర్కొంది. వాడివేడి చర్చలకు 'ఐరాస' వేదిక కాదన్న విషయం గుర్తెరిగిన మోడీ, భారత్ ప్రతిష్ఠతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునే విధంగానే మాట్లాడారని, ఒక విధంగా అదే సరైన పంథా అని కొనియాడింది. కానీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం సీరియస్ అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారని విమర్శించింది.