: చైనా దురాక్రమణలను సహించేది లేదు: కేంద్రం
చైనా దురాక్రమణలను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని కేంద్రం ప్రకటించింది. చైనా దురాక్రమణల నుంచి దేశ భూభాగాన్ని కాపాడుకుంటామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజూ స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రిజిజూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పటిదాకా చైనా పాల్పడిన చర్యలను గమనించాం. ఇకపై చైనా దురాక్రమణలను ఎంతమాత్రం సహించేది లేదు. భారత భూభాగాన్ని దురాక్రమణదారుల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం’’అని ఆయన చెప్పారు. సరిహద్దు వెంట శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కొన్నిసార్లు పొరుగుదేశాల దుందుడుకు చర్యలను సహిస్తున్నా, అనవసర రాద్ధాంతాలకు దూరంగా ఉండాలన్న భావనే తప్ప మరొకటి కాదన్నారు. పొరుగు దేశాల ఈ తరహా చర్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.