: ఇప్పటికీ నన్ను అంటరానివాడిగానే చూస్తున్నారు: బీహార్ సీఎం మాంఝీ ఆవేదన
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనను ఇప్పటికీ అంటరానివాడిగానే చూస్తున్నారని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు సీఎం హోదాలో ఉన్న తనను అంటరానివాడిగా చూస్తున్నారని ఆరోపించిన ఆయన, దళిత కుటుంబంలో జన్మించడమే తాను చేసిన పాపమా? అని కూడా ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తమ ఇంటిలో జరిగే కార్యక్రమాలకు తనను ఆహ్వానిస్తున్నారని, పూజల్లోనూ తాను పాల్గొనేందుకు అనుమతిస్తున్నారని ఆయన చెప్పారు. అయితే సదరు పూజల తర్వాత తాను అటు వెళ్లగానే దేవతా విగ్రహాలను కడుగుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని తమ పార్టీ సీనియర్ నేత్ రామ్ లఖన్ రామ్ స్వయంగా తనకు చెప్పారన్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పాల్పడుతున్న ఈ చర్యలు దళితులను అవమానపరిచేవేనని చెప్పిన ఆయన, వారి చర్యలు సమాజంలో మనం ఎంత అట్టడుగున ఉన్నామన్న విషయాన్ని కళ్లకు కడుతోందని ఆగ్రహం వెళ్లగక్కారు.