: బెయిల్ కోసం నేడు కర్ణాటక హైకోర్టుకు జయలలిత... లాయర్ గా రామ్ జెఠ్మలానీ!
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం నేడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. కర్ణాటక హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో వెకేషన్ బెంచ్ లో ఆమె తన బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయనున్నారు. తన శిక్షపై స్టే విధించడంతో పాటు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టుకు వెళ్లాలని ఆదివారమే ఓ నిర్ణయానికి వచ్చిన జయలలిత, అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం తన పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రసిద్ధ న్యాయవాది రామ్ జెఠ్మలానీ, జయలలిత బెయిల్ పిటిషన్ ను కోర్టులో సమర్పించనున్నట్లు తెలుస్తోంది. గతంలో టాన్సీ భూముల కుంభకోణంలోనూ జయలలితను రామ్ జెఠ్మలానీనే బయటపడేసిన సంగతి తెలిసిందే. అంతేకాక శనివారం నాటి ప్రత్యేక కోర్టు తీర్పుపై రామ్ జెఠ్మలానీ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు కూడా జెఠ్మలానీనే సంప్రదించినట్లు సమాచారం.