: తెలుగు తల్లి ఎవరికి పుట్టిందనడం కేసీఆర్ వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది: ఇంద్రసేనా రెడ్డి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి... రోజూ ఏదో ఒక సమస్యను సృష్టిస్తూ, ప్రజలను రెచ్చగొడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. తెలుగుతల్లి ఎవరు? ఎవరికి పుట్టింది? అంటూ చాలా అసహ్యంగా కేసీఆర్ మాట్లాడారని... ఆంధ్రలో తెలుగు మాట్లాడతారని, తెలంగాణలో కూడా తెలుగే మాట్లాడతారని... అంత మాత్రం విజ్ఞత కూడా ఆయనకు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంటు సమస్యలు, విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని... వేటిని కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై కొన్ని పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయని... వాటిని ప్యాక్ చేసి పక్క రాష్ట్రానికి పంపిస్తామని కేసీఆర్ దిగజారి మాట్లాడారని ఇంద్రసేనా అన్నారు. ఈ వ్యాఖ్యలను హుందాగా కూడా చేయడానికి అవకాశం ఉందని... కానీ, కేసీఆర్ కు అలాంటివేమీ లేవని చెప్పారు. ఎంతసేపూ ప్రజలను రెచ్చగొట్టడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.