: స్కిల్ ఇండియా చోదక శక్తి... కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్!
ప్రధాని కలల ప్రాజెక్టులో 'స్కిల్ ఇండియా' కూడా ఒకటి. అయితే ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ కంటే కీలకంగా మారారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. దాదాపు 20 మంత్రిత్వ శాఖల పరిధిలోని 70 కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను భుజానికెత్తుకున్న సోనోవాల్, తనపై ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన నమ్మకానికి ధీటుగా పనిచేస్తున్నారు. నిత్యం రాత్రి 9 గంటల దాకా శాస్త్రిభవన్ లోని తన కార్యాలయంలో పైళ్ల క్లియరెన్స్ లో మునిగి ఉండే సోనోవాల్, వస్త్ర ధారణలోనూ విలక్షణంగా దూసుకుపోతున్నారు. రాజకీయాల్లోకి రాగానే టీషర్టులు, జీన్ ప్యాంట్లను వదిలేస్తున్న నేతాశ్రీలకు భిన్నం సోనోవాల్. నిత్యం టీషర్టుల్లో కనిపించే సోనోవాల్ నూటికి నూరుపాళ్లు సాఫ్ట్ వేర్ టెక్కీగానే కనిపిస్తారు. 51 ఏళ్ల వయసులోనూ ఆయన నూనూగు మీసాల నూతన యవ్వనుడిలా ఇట్టే ఆకట్టుకుంటున్నారు. గడచిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ప్రధాని నరేంద్ర మోడీ, తన మంత్రివర్గ సహచరుల ఎంపికలో వినూత్నతకు చోటిచ్చారు. అసోం నుంచి వాజ్ పేయి మంత్రివర్గ సభ్యుడిగా పనిచేసిన సీనియర్ నేత బిజోయ చక్రవర్తిని కాదని, సోనోవాల్ కు అవకాశమిచ్చారు. స్కిల్ ఇండియాతో పాటు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్న సోనోవాల్, ప్రధాని తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయరాదన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.