: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో రజతం


ఆసియా క్రీడల్లో భారత్ కు మరో రజతం లభించింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో మహిళల 20 కిలోమీటర్ల నడక పోటీలో భారత అథ్లెట్ ఖుష్బీర్ కౌర్ రజతం సాధించింది. 21 ఏళ్ళ ఈ అమృత్ సర్ అమ్మాయి (1:33:07) ఆదివారం జరిగిన నడక రేసులో తన అత్యుత్తమ వ్యక్తిగత సమయం నమోదు చేసుకుంది. అటు, టెన్నిస్ లో యుకీ భాంబ్రీ కాంస్యం దక్కించుకున్నాడు. సెమీఫైనల్లో భాంబ్రీ 6-3, 2-6, 1-6తో జపాన్ కు చెందిన యోషిహిటో నిషియోకా చేతిలో ఓటమిపాలయ్యాడు. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, ప్రార్థన జోడీ సెమీఫైనల్లో 7-6, 2-6, 4-10తో చైనీస్ తైపీ జోడీ చిన్ వీ చాన్, సు వీ సీహ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ ఓటమితో సానియా జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది. బాక్సింగ్ విషయానికొస్తే... మేరీ కోమ్ సెమీస్ చేరింది. దీంతో, భారత్ కు ఓ పతకం ఖాయమైంది. మహిళల ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) విభాగంలో మేరీ కోమ్ 3-0తో సి హైజువాన్ (చైనా)ను చిత్తు చేసింది. ఆర్చరీలో భారత్ కు నేడు నిరాశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రికర్వ్ అంశంలో కాంస్యం కోసం పోరులో భారత అమ్మాయిల బృందం జపాన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 30 పతకాలు (3 స్వర్ణ, 5 రజత, 22 కాంస్య) చేరాయి. ఓవరాల్ స్టాండింగ్స్ లో భారత్ 12వ స్థానంలో ఉంది. చైనా, దక్షిణకొరియా, జపాన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనా ఖాతాలో 101 పసిిడి పతకాలు ఉండగా, దక్షిణకొరియా 40, జపాన్ 32 స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నాయి.

  • Loading...

More Telugu News