: ‘మేడ్ ఇన్ ఇండియా మెయిల్’కు కేంద్రం ఆమోదం
భారత ప్రభుత్వం సొంతంగా రూపొందించిన ‘మేడ్ ఇన్ ఇండియా మెయిల్’ సర్వీసుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో, ఈ ఏడాది చివరి నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు సర్కారీ మెయిల్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపనున్నారు. ‘‘ఈ సర్వీసును ఇప్పుడిప్పుడే అమలులోకి తెస్తున్నాం. ప్రస్తుతం పది లక్షల మంది ఉద్యోగులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి దీనిని అందుబాటులోకి తేనున్నాం’’ అని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి ఆర్ ఎస్ శర్మ చెప్పారు. రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ వ్యవస్థకు చెందిన సర్వర్ నుంచి ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని తస్కరించడం ఇక సాధ్యం కాదు. హ్యాకర్ల నుంచి ప్రభుత్వ కీలక సమాచారాన్ని రక్షించేందుకే ఈ తరహా చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.