: జయ గార్డెన్ కు వచ్చే వారెవరు?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాదులోనూ తనకంటూ ఓ సొంత విడిది ఏర్పాటు చేసుకున్నారు, దాని పేరే జయ గార్డెన్. హైదరాబాద్ లోని బోయిన్ పల్లి నుంచి కొంపల్లి మధ్యలో వెలసిందీ రాజభవనం. జయలలిత ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న రాజసౌధం ఇది. వీలు చిక్కినప్పుడల్లా నేరుగా హైదరాబాద్ వచ్చేసే జయలలిత ఇక్కడే బస చేసేవారు. అధికారిక పర్యటనలకు వచ్చినా, మరే కారణంతో వచ్చినా హైదరాబాద్ లో ఆమె విడిది జయ గార్డెన్ లోనే. నగరంతో 40 ఏళ్ల అనుబంధం ఉన్న జయలలిత 1970 లోనే బోయిన్ పల్లి పరిధిలోని పేట్ బషీరాబాద్ లో 15 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో సకల హంగులతో రాజభవనాన్ని నిర్మించుకున్నారు. జయలలిత గార్డెన్ గా నామకరణం చేసుకున్న ఈ భవంతి, తదనంతర కాలంలో జయ గార్డెన్స్ గా నగరవాసులకు చిరపరిచితమే. భవనం చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకున్న జయలలిత, అందులో పనివాళ్లుగా తమిళులనే నియమించుకున్నారు. తాజాగా, ఆమె నాలుగేళ్ల పాటు జైలులో ఉండాల్సి రావడంతో జయ గార్డెన్ తలుపులు దాదాపుగా మూతపడినట్లే. అయితే, ఈ స్థలాన్ని జయలలిత తన పేరు మీద కాక తన చెలికత్తె శశికళ పేరుపై కొన్నట్లు తాజాగా వెల్లడైంది.