: ‘మహా’ జన సమీకరణలో బీజేపీ, శివసేనల పోటాపోటీ!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించేందుకు బీజేపీ, శివసేనలు పోటాపోటీగా దూసుకెళుతున్నాయి. ప్రాంతీయ పార్టీగా శివసేన ఈ పోటీలో ముందుండగా, ఆ పార్టీకి దీటుగా సభలు నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ముంబై వచ్చారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను ముంబైలోనే మకాం పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జన సమీకరణలో శివసేనతో పోటీ పడలేమన్న సత్యాన్ని గ్రహించిన బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సహకారం కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరెస్సెస్ కు భారీ కేడర్ ఉంది. దాదాపు 50 వేలకు పైగా ఉన్న స్వయం సేవకులను రంగంలోకి దింపాలని ఆరెస్సెస్ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఎన్నికల ప్రచారంలో వీలున్నంత మేర వినియోగించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే 15 బహిరంగ సభల్లో మోడీ పాల్పంచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇక, జనంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న శివసేన, భారీ జన సమూహాలతో, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారం సాగించేందుకు కార్యరంగాన్ని సిద్ధం చేసుకుంది. 25 ఏళ్ల పాటు మిత్రులుగా కొనసాగి, ఈ ఎన్నికల్లో వేరుపడ్డ ఇరు పార్టీలు, ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.