: 'అమ్మ'కు సెప్టెంబరు మాసం అచ్చిరాదా?
కార్యకర్తలు, అభిమానులు 'అమ్మ'గా పిలుచుకునే అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు సెప్టెంబరు మాసం అచ్చిరానట్టే కనిపిస్తోంది. గతంలోనూ టాన్సీ భూముల వ్యవహారంలో ఆమె సీఎం పదవిని వీడాల్సి వచ్చింది. 2001లో సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పుతో జయ సీఎం పీఠం దిగక తప్పలేదు. తనకు విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా నియమించి, ఆమె తప్పుకున్నారు. ఆరోపణల నుంచి విముక్తి కలిగాక, 2002లో జరిగిన ఉపఎన్నికల్లో నెగ్గి, అధికారంలోకి వచ్చారు. తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ సెప్టెంబర్ లోనే తీర్పు వెలువడింది. వేద పండితులు పెట్టిన ముహూర్తంలోనే బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి బయల్దేరారు జయ. కానీ, ప్రయోజనం దక్కలేదు. అటు, జయ సంఖ్యా శాస్త్రాన్ని బాగా విశ్వసిస్తారు. 'అమ్మ'కు 9 అచ్చొచ్చిన సంఖ్య కాగా, శనివారం నాటి తేదీ 27ను కూడితే తొమ్మిది వస్తుండడంతో, తమ అధినేత్రికి అనుకూలంగా తీర్పు వస్తుందని కార్యకర్తలు, అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి తీర్పు వెలువరించగానే వారు షాక్ కు గురయ్యారు.