: ఆమెకే అంత శిక్ష పడితే, జగన్ కు ఇంకెంత పడుతుందో!: పయ్యావుల
అక్రమాస్తుల కేసులో జయలలితపై ఒక్క చార్జిషీటు నమోదైతైనే నాలుగేళ్ళు జైలు శిక్ష పడిందని, ఆ విధంగా చూస్తే జగన్ కు ఇంకెంత శిక్ష పడుతోందనని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారు. రూ.66 కోట్ల అవినీతికి సంబంధించి జయకు ఒక్క చార్జిషీటుతోనే 4 ఏళ్ళ జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించారని తెలిపారు. జగన్ పై 11 చార్జిషీట్లు ఉన్నాయని, రూ.44 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయని... ఆ లెక్కన ఇంకెంత శిక్ష పడుతుందోనని పయ్యావుల వ్యాఖ్యానించారు. జగన్ ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని అన్నారు. దొంగ నమస్కారాలతో ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. జైలు శిక్షకు గురైన జయ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయారని, జగన్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుందని పయ్యావుల తెలిపారు.