: 18 ఏళ్ల పాటు విచారణ కొనసాగడానికి ఎన్నో కారణాలున్నాయి


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయ అక్రమాస్తుల కేసు ఏకంగా 18 ఏళ్ల పాటు కొనసాగింది. ఇంత సుదీర్ఘంగా విచారణ కొనసాగడానికి అనేక కారణాలున్నాయి. అయితే వీటిలో జయ రాజకీయ ప్రత్యర్థి డీఎంకేనే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో కొనసాగుతున్న కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని డీఎంకే కోరడంతో... కేసులో ఒక్కసారిగా ప్రతిష్ఠంభన ఏర్పడింది. డీఎంకే వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కేసును వేరే రాష్ట్రానికి మార్చాలని ఆదేశించింది. దీంతో, కేసు బెంగళూరు కోర్టుకు మారింది. అయితే, బెంగళూరు కోర్టుకు బదిలీ చేయడానికి ఏకంగా ఆరేళ్ల సమయం పట్టింది. ఈ కేసులో అప్పటికే 76 మంది సాక్షులను విచారించారు. క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. కేసు బెంగళూరుకు చేరిన తర్వాత కొంత మంది సాక్షులు ఎదురు తిరిగారు. బెదిరించి తమతో తప్పుడు సాక్ష్యం ఇప్పించారని కోర్టుకు తెలిపారు. దీనికి తోడు, కేసులోని నిందితులు కూడా లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలు చేస్తూ పోయారు. దీంతో, కేసు విచారణ ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగింది. ఒకానొక సమయంలో ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుంది. నిందితులతో ప్రాసిక్యూషన్ చేతులు కలిపిందని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ 18 ఏళ్ల సుదీర్ఘ విచారణలో ప్రాసిక్యూషన్ ముందుకు జయ వచ్చింది కేవలం రెండుసార్లు మాత్రమే. ఒకానొక సమయంలో కేసు ముగింపు దశకు వచ్చిందనుకున్నప్పుడు జయకు 1339 ప్రశ్నలు సంధించారు. ఇలా ఈ కేసు ఇంతకాలం కొనసాగడానికి ఎన్నో అంశాలు కారణమయ్యాయి.

  • Loading...

More Telugu News