: నమ్మిన సిద్ధాంతం కోసం వెంకయ్యనాయుడు అలుపెరగని పోరాటం చేశారు: బాబు
నమ్మిన సిద్ధాంతం కోసం వెంకయ్యనాయుడు అలుపెరగని పోరాటం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ, వెంకయ్యనాయుడి వాగ్థాటికి అంతులేదని అన్నారు. ఆయన వాగ్థాటి, రాజీలేని తత్వం కారణంగా అంచెలంచెలుగా ఎదిగి, దక్షిణ భారత దేశానికి ప్రతినిధిగా ఉన్నారని పేర్కొన్నారు. మీడియా సంస్థలు వాస్తవాలను చూపాలని, వివాదాలకు తావులేని వార్తలు ప్రసారం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని పునాదుల నుంచి అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానికి, సోషల్ మీడియాను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలకు కూడా గతి లేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. అయినప్పటికీ సవాళ్లను ఎదుర్కొని ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని బాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలుపుకుని మెగాసిటీగా రూపొందిస్తామని ఆయన అన్నారు. అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ర్యాలీ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దేశానికి ఏ పెట్టుబడి వచ్చినా ఆంధ్రప్రదేశ్ కు రాబట్టుకోవాల్సి న అవసరం ఉందని ఆయన తెలిపారు. మనది ఒరిజనల్ స్టేట్ అని, అందుకే పాత విధానాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.