: నవాజ్ కు దీటుగా జవాబివ్వనున్న మోడీ!
జమ్మూ, కాశ్మీర్ అంశంలో తమపై నిందలేసేలా వ్యాఖ్యానించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారత ప్రధాని దీటుగానే జవాబివ్వనున్నారు. ‘ఈ విషయంపై వాస్తవాలు వెల్లడించే హక్కు భారత్ కు ఉంది. ఐక్యరాజ్యసమితి వేదికగానే దీనిపై భారత్ తన వాదనను వినిపించనుంది’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. ఏళ్లుగా హింసలో మగ్గుతున్న కాశ్మీరీలు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కోరుకుంటున్నారన్న నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై మోడీ, ఐరాస వేదికపై నుంచే తన స్పందనను తెలియజేయనున్నారని అక్బరుద్దీన్ తెలిపారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందామని చెబుతూ వస్తున్న భారత్ వాదనను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తున్న పాక్, ప్రతి అంతర్జాతీయ వేదికపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇరుదేశాల మధ్య మాటల యుద్ధానికి తెర లేపుతోంది. ఇదిలా ఉంటే, షరీఫ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చూపుతున్న పాక్, తన సమస్యలను కప్పిపుచ్చుకునేందుకే కుతంత్రాలు పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ ఆరోపించారు.