: జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు నేడే!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని ట్రయల్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసుపై తమిళనాడులో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తీర్పును వాయిదా వేయాలన్న ఓ న్యాయవాది పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. 18 ఏళ్ల క్రితం జయలలితపై నమోదైన ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 1991-96ల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జయలలిత, రూ. 61.65 కోట్ల మేర అక్రమాస్తులను కూడబెట్టారన్న ఆరోపణల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగిన ఈ కేసు విచారణలో ఇప్పటిదాకా ఆరుగురు న్యాయమూర్తులు మారారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు ప్రాంగణంలోని ట్రయల్ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి మైఖేల్ డీ చున్హా నేడు తుది తీర్పు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి జయలలిత శనివారం బెంగళూరు వస్తున్నారు. దీంతో అటు చెన్నైతో పాటు ఇటు బెంగళూరులోనూ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.