: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన బాబు
తిరుమల వెంకటేశ్వరునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తిరుమలలో మూడు లైన్ల విధానం అమలుతో భక్తులకు మంచి దర్శనం చేసుకునే వీలు కలిగిందని అన్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని నామం మాత్రమే వినపడాలని ఆయన సూచించారు. టీటీడీ సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నట్టు కాకుండా, శ్రీనివాసుని సేవ చేస్తున్నట్టు భావించాలని ఆయన తెలిపారు. ఈవో, సిబ్బంది అందరూ బాగా పని చేస్తున్నారని ఆయన అభినందించారు.