: ఆరోగ్యశ్రీ ముసుగులో రూ. 246 కోట్ల మేత!
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ ఆస్పత్రులకు వరంగా మారిందన్న ఆరోపణలను నిజం చేస్తూ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ముసుగులో పేదలకు చికిత్సలు అందించకుండానే 20 కార్పొరేట్ ఆస్పత్రులు రూ. 246 కోట్ల మేర నిధులను తమ జేబుల్లో వేసుకున్నాయని తాజాగా హైదరాబాద్ కు చెందిన ‘రైట్ టూ హెల్త్’ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇన్ పేషంట్ విభాగంలో ఐదు శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కేసులకు కేటాయించాలన్న ప్రభుత్వ నిబంధనను ఆసరా చేసుకున్న సదరు ఆస్పత్రులు, రోగులకు సేవలందించకుండానే నిధులను బొక్కేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖాధికారులు కూడా తేల్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన ఆ సంస్థ, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. తమ ఆస్పత్రుల్లో 5 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయించామని చెప్పుకున్న సదరు యాజమాన్యాలు, వివరాల వెల్లడికి మాత్రం ముఖం చాటేశాయి. దీంతో కూపీ లాగిన వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అసలు విషయాన్ని వెలికితీశారు. అయితే సదరు ఆస్పత్రులపై చర్యలకు మాత్రం మీనమేషాలు లెక్కించారు. తాజాగా రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ వ్యవహారం దాదాపుగా మూలనపడింది. అయితే, అవినీతికి బాధ్యులైన ఆస్పత్రుల నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగమైన నిధులను ముక్కుపిండి మరీ వసూలు చేయాలని స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేస్తోంది.