: ఇస్రో శాస్త్రవేత్తల్లో ప్రతిష్ఠాత్మక వర్సిటీల విద్యార్థులు 2 శాతం మందే!
ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఇస్రో)లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఐఐటీ, ఎన్ఐటీ తరహా ప్రతిష్ఠాత్మక వర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులు కేవలం రెండంటే రెండు శాతం మంది మాత్రమే ఉన్నారట. అదేంటీ, ప్రపంచ అంతరిక్ష శోధనల్లోనే పేరుగాంచిన ఇస్రోలో ఐఐటీ, ఎన్ఐటీల్లో విద్యనభ్యసించిన వారు కేవలం రెండు శాతమేనా? అంటే, అవుననే అంటున్నాయి గణాంకాలు. ఇస్రోనే కాదు, జాతీయ రహదారులు, రైల్వేలు కూడా వారిని ఆకర్షించలేకపోతున్నాయట. ఇస్రో నేతృత్వంలో పనిచేస్తున్న మూడు సంస్థలు, వాటిలోని ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే, ఇదే నిజమని నమ్మాల్సిందే మరి. తిరువనంతపురంలోని విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ లో మొత్తం 4,486 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా, అందులో ఐఐటీ, ఎన్ఐటీల నుంచి వచ్చినవారు కేవలం 43 మందే ఉన్నారు. ఇక మన హైదరాబాద్ లోని ఇస్రో సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్నీలో 864 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా, వారిలో ప్రతిష్ఠాత్మక వర్సిటీల నుంచి వచ్చిన వారు ఇద్దరంటే, ఇద్దరే ఉన్నారు. ఇక అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషస్స్ సెంటర్ లో 1,183 మంది శాస్త్రవేత్తలుండగా, 144 మంది మాత్రమే ఐఐటీ, ఎన్ఐటీల నుంచి వచ్చారట. అయితే విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు తాము ఐఐటీ, ఎన్ఐటీలతో పాటు ఇతర విద్యాసంస్థలకూ వెళ్లక తప్పడం లేదని, తాము చేస్తున్న పరిశీలనల్లో సత్తా ఉన్న విద్యార్థులు లభిస్తున్నారని కూడా ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.