: రైతు రుణమాఫీపై నెలాఖరులోగా నిర్ణయం: సుజనా చౌదరి
రైతు రుణమాఫీ చేశామని, అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతుకి ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా రుణమాఫీ చేస్తామని అన్నారు. బ్యాంకులతో విధివిధానాలు నిర్ణయించలేదని, సోమవారం తుది చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. బ్యాంకులకు డబ్బులు ఎలా చెల్లించాలన్న దానిపైనే చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. నెలాఖరులోపు పంటరుణాలు మాఫీ చేయకపోతే పంట భీమాకు ఇబ్బంది కలుగుతుందని ఆయన చెప్పారు. అందుకే నెలాఖరులోగా రుణమాఫీ అమలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.