: మహారాష్ట్రలో కుదరని పంపకాలు... ఇక అన్నీ వేరు కుంపట్లే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు కుదరడం లేదు. శివసేన, బీజేపీ మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు... కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో సుదీర్ఘ బంధాలకు బీటలు వారుతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల ఉత్కంఠ తార స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వేచి చూసే ధోరణితో ఇంతకాలం నెట్టుకు వచ్చాయి. శివసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరితే కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్, ఎన్సీపీ వేచి చూశాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తులో రేగిన విభేదాల కారణంగా విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూడా విడిగానే ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తున్నాయి. మహాకూటమిలో బీజేపీ ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తుండగా, ప్రతిపక్షంలో ఎన్సీపీ ఎక్కువ సీట్లు కావాలని మారాం చేస్తోంది. ఈ నేపధ్యంలో నాలుగు పార్టీల్లో చర్చలు, ప్రతిష్ఠంభనలతో సీట్ల పంపకాల్లో నరాలు తెగే ఉత్కంఠ చోటుచేసుకుంటోంది. సీట్ల పంపకాలపై రేపటికి స్పష్టత రాని పక్షంలో పొత్తులు లేకుండానే మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశముంది. పొత్తులపై రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ, నామినేషన్లు వేసిన తరువాత ఉపసంహరణ వరకు పొత్తులపై సమగ్రమైన స్పష్టత రాదని తెలిపారు. దీంతో గత 25 ఏళ్లుగా ప్రాణమిత్రులుగా ఉన్న శివసేన, బీజేపీ... గత 15 ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తాయా? లేక విడిపోతాయా? అనేది ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నామని వారు చేతులెత్తేశారు.