: మీ క్రెడిట్ కార్డు కంటే మీ మెడికల్ రికార్డే విలువైనది!
మీ వ్యక్తిగత వైద్య సమాచారం మీ క్రెడిట్ కార్డు కంటే పదింతలు విలువైనదంటోంది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ). వ్యక్తుల మెడికల్ రికార్డు హ్యాకర్ల చేతి నుంచి బ్లాక్ మార్కెట్లోకి వెళితే జరిగే నష్టం భారీ స్థాయిలో ఉంటుందని ఎఫ్ బీఐ హెచ్చరిస్తోంది. అమెరికాలో వైద్య సేవలు అందించే సంస్థలు సరైన సైబర్ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని బ్యూరో కిందటి నెలలో సూచించింది. ఓ ఆరోగ్య సంస్థకు చెందిన కంప్యూటర్ నెట్ వర్క్ లోకి జొరబడిన చైనా హ్యాకర్లు 4.5 మిలియన్ల మంది రోగులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని బ్యూరో వెల్లడించింది. హ్యాకర్లు రికార్డుల్లోని సమాచారాన్ని అమ్మకానికి పెడుతున్నారని తెలిపింది. రోగుల పాలసీ నంబర్లు, డయాగ్నసిస్ కోడ్ లు, బిల్లుల సమాచారాన్ని హ్యాకర్లు మోసగాళ్ళకు విక్రయిస్తున్నారట. ఈ వివరాలను కొనుగోలు చేసిన మోసగాళ్ళు రోగుల పేర్లు, పుట్టినరోజు తేదీలతో నకిలీ ఐడీలు సృష్టించి, వాటి సాయంతో వైద్య ఉపకరణాలు, మందులు కొనుగోలు చేస్తున్నారట. అంతేగాకుండా, వారి పేరిట బీమా క్లెయిమ్ చేస్తున్నారని తెలుస్తోంది. క్రెడిట్ కార్డు పోయిందంటే, వెంటనే దాని కార్యకలాపాలను నిలుపుదల చేయవచ్చని... మెడికల్ రికార్డు గల్లంతయిందంటే మాత్రం, అది వేరొకరిచేతిలో పడి దుర్వినియోగం అవుతోందన్న విషయం గుర్తించడానికే చాలా సమయం పడుతుందని ఎఫ్ బీఐ అంటోంది.