: పాకిస్థాన్ లో అండర్ వరల్డ్ డాన్ కుమార్తె వివాహం


భారత పోలీసులకు దొరకుండా రహస్యంగా ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్ కుమార్తె జోయా వివాహం యూఎస్ కు చెందిన వైద్యుడితో పాకిస్థాన్ లో జరిగింది. గత వారం కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో ఉన్న ఓ ప్యాలెస్ లో ఈ వివాహం సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిగినట్టు ఇంటలిజెన్స్ బ్యూరో వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి చోటా షకీల్ కు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని అర్థమవుతోంది. వివాహం తర్వాత దుబాయ్ లో గత గురువారం పెద్ద ఎత్తున రిసెప్షన్ జరిగిందని ఇంటర్ పోల్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఐబీ వర్గాలు చెప్పాయి. దీంతో, ఈ వారంలో ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన సందర్శకుల జాబితాపై ఇంటలిజెన్స్ వర్గాలు నిఘా ఉంచాయి. మరింత సమాచారం ప్రకారం, షకీల్ కూతురు ఇటీవలే ఎంబీబీఎస్ డాక్టరేట్ పూర్తి చేసిందని, అనంతరం ఆమె కరాచీలో పెళ్లి చేసుకుందని, అమెరికాలో స్థిరపడిందని వెల్లడించారు. అయితే, పూర్తిగా ఇది కుదిర్చిన వివాహమంటున్నారు. ఈ వార్తలను షకీల్ ఖండించినప్పటికీ, ముంబయి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ముంబయి క్రైం బ్రాంచ్ చెప్పిన ప్రకారం, "ప్రత్యర్థులు లేదా భద్రతా సంస్థలు అనుసరిస్తారన్న భయంతో చోటా షకీల్ తమ కుటుంబ కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించాడు. అందుకే తాను కూడా వెళ్లకుండా దుబాయ్ లో కుమార్తె పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. దీనికి భారత్ లోని ముఖ్యంగా ముంబయి నుంచి, సౌదీ అరేబియా నుంచి పలువురు అతిథులు హాజరయ్యారు" అని అధికారి వివరించారు.

  • Loading...

More Telugu News