: ఎస్సెమ్మెస్ చేయండి... రైల్లో భోజనం అందుకోండి!
ఇప్పటివరకు దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళలో ప్రయాణికులు భోజనం కావాలంటే పాంట్రీ కార్ సిబ్బందికి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై, ఎస్సెమ్మెస్ ద్వారానూ భోజనం తెప్పించుకోవచ్చు. తమకు కావాల్సిన ఆహార పదార్థాల వివరాలను 139 నంబర్ కు ఎస్సెమ్మెస్ చేస్తే చాలు, సిబ్బంది సరఫరా చేస్తారు. ఢిల్లీ-అమృత్ సర్ సెక్షన్లో నేటి నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఢిల్లీ-పఠాన్ కోట్ ఎక్స్ ప్రెస్, కథియార్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్, అమృత్ సర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్, షానే పంజాబ్ ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్, షహీద్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఎస్సెమ్మెస్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు. ఈ రైళ్ళలో పాంట్రీకార్లు లేకపోయినా, ఐఆర్సీటీసీ ఆహార సదుపాయం కల్పిస్తుందని ఆ అధికారి తెలిపారు. ఇ-కేటరింగ్ లో భాగంగానే ఈ విధానం ప్రవేశపెట్టామని అన్నారు. ప్రయాణికుడు తనకు కావాల్సిన ఆహార పదార్థాలు, పీఎన్ఆర్ నెంబర్ ను మెసేజ్ చేస్తే చాలని చెప్పారు.