: కపిల్ దేవ్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను యూకేలో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. క్రికెట్ కు విశేష సేవలందించడంతో పాటు, బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడడాన్ని గుర్తిస్తూ, ఈ ఆల్ రౌండర్ కు ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఐబీఈఎఫ్) అవార్డు అందించింది. బుధవారం సాయంత్రం లండన్ లోని 'హౌస్ ఆఫ్ లార్డ్స్'లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ, భారతీయుణ్ణయినందుకు ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. భారత్ ను పాలించినందుకు ఇంగ్లాండ్ ను ద్వేషిస్తానని, అయితే, క్రికెట్ ను మనకు పరిచయం చేసినందుకు సంతోషిస్తానని పేర్కొన్నారు. వారు క్రికెట్ ఆడడంలో ఎలా తడబడతారో, తాను ఇంగ్లిష్ మాట్లాడడంలో అలా ఇబ్బంది పడతానని చమత్కరించారు.