: హైదరాబాద్ లో విదేశీ మద్యం ఏరులై పారుతోంది!
హైదరాబాద్ మహా నగరంలో విదేశీ మద్యం ఏరులై పారుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటైన రిటైల్ షాపులే ఇందుకు వేదికలవుతున్నాయి. దేశీ మద్యం విక్రయాలకు మాత్రమే పరిమితం కావాల్సిన ఈ షాపులు, గుట్టుచప్పుడు కాకుండా విదేశీ మద్యాన్ని విక్రయిస్తూ తమ యజమానులను కోట్లకు పడగలెత్తేలా చేస్తున్నాయి. అబ్కారీ శాఖ హైదరాబాద్ రేంజీ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ నేతృత్వంలో మంగళవారం జరిగిన దాడుల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జ్యోతి కిరణ్ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు బంజారాహిల్స్ రోడ్ నెం.1, అమీర్ పేటల్లో సోనా వైన్స్ పేరిట ఏర్పాటైన రెండు మద్యం విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో తయారైన 200కు పైగా ఖరీదైన మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. అంతేకాక విదేశాల్లో తయారైన బీరు బాటిళ్లు కూడా ఈ షాపుల్లో వెలుగు చూశాయి. దీంతో రెండు షాపులకు చెందిన యజమానులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా శ్రీలంక నుంచి చెన్నై మీదుగా విదేశీ మద్యాన్ని అక్రమ మార్గాల్లో హైదరాబాద్ కు తరలిస్తున్న వైనం వెలుగు చూసింది. తనిఖీ చేసిన రెండు షాపుల్లోనూ విదేశీ మద్యం లభించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని మరిన్ని షాపుల్లోనూ ఈ అక్రమ దందా నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.