: కారప్పొడితో స్వామీజీకి అభిషేకం
పాలు, పళ్ల రసాలు, పవిత్ర జలాలతో దేవుళ్ళకు, స్వామీజీలకు అభిషేకాలు నిర్వహించడం సాధారణం. అందుకు భిన్నంగా జరపాలనుకున్నారో... లేక, మరేదైనా మర్మముందో కానీ ఓ స్వామీజీ కారప్పొడితో అభిషేకం చేయించుకుని సంచలనం సృష్టించారు. తమిళనాడులోని వేలూరు సత్ వచ్చారిలోని గంగమ్మ ఆలయానికి సమీపంలోని ఓ తోటలో ఓ స్వామీజీ నాలుగు నెలలుగా నివసిస్తున్నారు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలియవు. ప్రత్యంగరా దేవిని పూజించే ఆయనకు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలు వచ్చు. ప్రపంచశాంతి కోసం కారప్పొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకుంటానని రెండు రోజుల క్రితం ఆయన ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్రత్యంగరా దేవి పూజలను పూర్తి చేసిన స్వామీజీ ఓ పెద్ద గంగాళంలో కూర్చున్నారు. 31 కేజీల కారాన్ని నీటిలో కలిపిన భక్తులు, కారప్పొడి నీటితో స్వామీజీకి అభిషేకం చేశారు. అంతలా కారం నీళ్ళు ఒంటిపై పడుతున్నా ఆయన మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తున్నవాడిలా సేదతీరాడు!