: నాకు శ్రీను వైట్ల లైఫ్ ఇవ్వలేదు, నేను ఆయనకు లైఫ్ ఇవ్వలేదు: కోన వెంకట్
సినీ పరిశ్రమలోను, రాజకీయాల్లోను శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని సినీ, రాజకీయ పండితులు అంటుంటారు. అలాగే, ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో దర్శకుడు శ్రీను వైట్ల, మాటల రచయిత కోన వెంకట్ మధ్య విభేదాలపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై మాటల రచయిత కోన వెంకట్ 'లౌక్యం' సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడారు. శ్రీను వైట్లతో తనది పదేళ్ల సినీ ప్రయాణమని అన్నారు. పది బ్లాక్ బస్టర్ సినిమాలు తామిద్దరం అందించామని వెంకట్ తెలిపారు. కొన్ని విభేదాల కారణంగానే తామిద్దరం స్నేహపూర్వకంగా విడిపోయామని కోన చెప్పారు. శ్రీను వైట్లకి తాను లైఫ్ ఇవ్వలేదని... అలాగే తనకు ఆయన లైఫ్ ఇవ్వలేదని కోన స్పష్టం చేశారు. ఎవరి కష్టం వారిదేనన్నారు. 'సత్య' సినిమాతో తాను హిట్ సాధిస్తే, 'ఆనందం' సినిమాతో శ్రీను విజయం సాధించారని కోన వెంకట్ తెలిపారు. ఇప్పటికీ తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన చెప్పారు.