: మరిన్ని సీట్లు కోరుతున్న చిన్న పార్టీలు... మొదటికొచ్చిన బిజెపి, శివసేన చర్చలు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై బిజెపి, శివసేన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటే, తాజాగా, ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లు సమాచారం. కారణం... ఆ కూటమిలోని మూడు చిన్న పార్టీలే! తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకుంటే కూటమి నుంచి తప్పుకుంటామని ఆ మిత్ర పక్షాలు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో గత రాత్రి (మంగళవారం) ఆలస్యంగా బీజేపీ, శివసేన కూటమి సమావేశం జరిగింది. ఆ సందర్భంగా, చిన్న పార్టీలు తమకు మరిన్ని సీట్లు కావాలని డిమాండ్ చేశాయట. అంతేగాదు, బీజేపీకి 130, శివసేనకు 151 కేటాయించుకుని తమకు మాత్రం ఏడు స్థానాలే ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయట. మొదట తాము అడిగిన విధంగా 18 సీట్లు ఇవ్వాలని ఆ చిన్న పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు రాజు శెట్టి అనే నేత మాట్లాడుతూ, "ఒకవేళ శివసేన కూటమిలో ఉన్న నాలుగు చిన్న పార్టీలకు ఏడు సీట్లే ఇస్తే అది మాకు తీవ్ర అవమానం. కాబట్టి, మొత్తం 288 స్థానాల్లో సేన, బీజేపీయే పోటీచేసి వాళ్ల స్వార్థాన్ని సంతృప్తి పరుచుకోవచ్చు" అని చెప్పారు. అటు, మహారాష్ట్రలో నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. ఈలోగా వారి అభ్యర్థులు ఖరారు కాకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి.