: మామ్ సక్సెస్ భారత్ కు ఎందుకు చారిత్రాత్మక విజయమంటే...!
మామ్ సక్సెస్ భారత్ కు ఎందుకు చారిత్రాత్మక విజయమంటే... 1. భారత్ తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్ ను పంపడంలో సక్సెస్ అయింది. నాసా సహా, అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపడంలో ఇప్పటి వరకు ఎవరూ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవలేదు. రష్యా తొమ్మిది సార్లు ఫెయిల్ అయిన తర్వాత పదోసారి సక్సెస్ అయ్యింది. 2. భారత్ ప్రయోగానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా అంగారక గ్రహంపైకి ఉపగ్రహాలు పంపడానికి 51 సార్లు ప్రయత్నాలు జరిగాయి. వీటిలో కేవలం 21 సార్లు మాత్రమే ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇస్రో విజయానికి ముందువరకు మూడు అంతరిక్ష సంస్థలు మాత్రమే అంగారక గ్రహంపైకి ఉపగ్రహాలను పంపడంలో సఫలమయ్యాయి. అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, యూరోపియన్ యూనియన్ లకు చెందిన సంస్థలు అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపగలిగాయి. 3. సాంకేతికంగా భారత్ కన్నా ఎంతో ముందున్న జపాన్, చైనాలు కూడా మార్స్ ప్రయోగాల్లో విఫలమయ్యాయి. అంగారక గ్రహంపైకి జపాన్ ప్రయోగించిన ఉపగ్రహం మధ్యలో ఇంధనం అయిపోయిన కారణంగా ఫెయిల్ అయ్యింది. చైనా 2011లో మార్స్ పైకి పంపించాలనుకున్న ఇంగ్హో 1 ఉపగ్రహం లాంచింగ్ సమయంలోనే ఫెయిల్ అయ్యింది. 4. మామ్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. మామ్ ను తయారుచేయడానికి ఉపయోగించిన మెటీరియల్స్ నుంచి... మామ్ ను లాంచ్ చేసే టెక్నాలజీ వరకు అంతా 'మేడిన్ ఇండియానే' 5. అత్యంత తక్కువ బడ్జెట్ తో ఇస్రో మార్స్ మిషన్ ను పూర్తి చేసింది. మంగళ్ యాన్ ప్రయోగానికి భారత్ ప్రభుత్వం ఇస్రోకు కేటాయించింది కేవలం 450 కోట్లు. ఇది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'గ్రావిటీ' బడ్జెట్ కన్నా తక్కువ. 6. కేవలం మూడంటే మూడేళ్లలో ఇస్రో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. సరిగ్గా,మూడేళ్ల క్రితం అంగారక గ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపించాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది. ఆలోచన వచ్చిన మూడేళ్లకే ఇంత భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేయడం సాధారణ విషయం కాదు.