: మోడీ ఇలాకా వారణాసిలో... టార్చిలైట్ల వెలుతురులో వైద్యుల ఆపరేషన్లు!
ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో విద్యుత్ కోతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 16 నుంచి రోజూ 22 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. అంటే రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ ప్రభావం అత్యవసర సేవలైన వైద్య సేవలపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. వారణాసిలోని కబీర్ చౌరా ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఓ రోగికి వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా లేదు. జనరేటర్ ను కొనుగోలు చేసేందుకు ఆస్పత్రి వద్ద నిధులూ లేవు. దీంతో టార్చిలైట్ల వెలుతురులోనే శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. సరిపడినంత విద్యుత్ అందుబాటులో లేదా అంటే, అదేమీ కాదనే చెబుతున్నాయి ఇంధన శాఖ వర్గాలు. మరి 22 గంటల విద్యుత్ కోతలు ఎలా అమలవుతున్నాయంటే, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి ఫలితంగానే ఈ దుస్థితి ఎదుర్కొంటున్నామని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ, వారణాసి నుంచే గెలిచిన నేపథ్యంలో, ఆ నియోజకవర్గంలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మొన్నటి ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న సమాజ్ వాదీ పార్టీ, లోక్ సభ ఎన్నికల్లో తమకు ఓట్లేయని వారణాసి ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు తెర లేపిందట. ఇందులో భాగంగానే వారణాసిలో 22 గంటల పాటు విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే శ్యాం దేవ్ రాయ్ చౌధరి ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే విద్యుత్ కోతలు అమలవుతున్నాయని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు వారణాసి పొరుగునే ఉన్న అజాంగఢ్ లో మాత్రం రోజులో 20 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటోందని చెబుతున్న చౌధరి, తన వాదనకు బలం చేకూర్చే కారణాలను చూపిస్తున్నారు.