: మామ్ అంగారక కక్ష్యలోకి ఎలా ప్రవేశిస్తుందంటే...!
భారత కీర్తి పతాకను రెపరెపలాడించే సన్నివేశం కాసేపట్లో చోటు చేసుకోబోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలకు సైతం సాధ్యం కాని భారత్ అంగారక యాత్ర కాసేపట్లో ముగియనుంది. 10 నెలల సమయంలో కోట్లాది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణానంతరం మామ్ అరుణ గ్రహానికి చేరువలోకి వచ్చింది. ఈ ఉదయం 4.17 గంటలకు మామ్ ను కుజుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 6.57 గంటలకు ఉపగ్రహాన్ని అంగారకుడి వైపు మళ్లించారు. 7.17.32 గంటల నుంచి 7.41 గంటల వరకు ప్రధాన ద్రవ అపోజీ మోటారు (లామ్) ఇంజిన్ మండేలా చేస్తారు. ఈ కొద్ది సేపటి కోసం మామ్ 250 కిలోల ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. లామ్ ఇంజిన్ మండటానికి ఐదు నిమిషాల ముందే అంటే 7.12 గంటలకే ఉపగ్రహాన్ని అంగారకుడి అవతలి వైపుకు వెళ్లేలా సంకేతాలు ఇస్తారు. అంగారకుడి అవతలి వైపుకు వెళ్లిన అనంతరం మామ్ కు భూమితో సంబంధాలు తెగిపోతాయి. 7.53 గంటల వరకు ఉపగ్రహం మార్స్ అవతలి వైపున్న నీడలోనే ఉంటుంది. ఈ సమయంలో ఉపగ్రహానికి చెందిన సంకేతాలను భూమి మీదున్న నెట్ వర్కింగ్ కేంద్రాలు అందుకోలేవు. కనీసం ఉపగ్రహం జాడను కూడా మనం తెలుసుకోలేము. అనంతరం... మార్స్ కక్ష్యలోకి వెళ్లిన మామ్ అంగారకుడి నీడలోంచి వెలుపలికి (భూమి వైపు) వస్తుంది. అప్పట్నుంచి మామ్ నుంచి భూమికి సంకేతాలు అందుతాయి. మామ్ నుంచి భూమికి సంకేతాలు చేరడానికి 12 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే భూమికి, అంగారకుడికి మధ్య ఉన్న దూరం 22 కోట్ల కిలోమీటర్లు కనుక!