: వజ్రవైఢూర్యాలు లేని ఖరీదైన వాచ్... ధర ఆరు కోట్ల పైమాటే
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ ను 'రోగర్ దుబున్' అనే గడియారాల సంస్థ తయారు చేసింది. వాచ్ ధర ఏకంగా 1.1 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో సుమారు ఆరు కోట్లకు పైమాటే... ఎక్స్ క్యాలిబర్ క్వాటర్ అనే పేరిట ఏడేళ్లపాటు జరిపిన పరిశోనల తరువాత ఈ వాచ్ ను తయారు చేశారు. దీనిని అసెంబుల్ చేసేందుకు నిపుణులు 2,400 గంటలు శ్రమించారట. మామూలు చేతి వాచీల మాదిరిగా కాకుండా, దీనిలో మొత్తం 6 డయల్స్ ఉన్నాయి. వాటిలో నాలుగు డయల్స్ 45 డిగ్రీల కోణంలో నిర్మించారు. దీంతో ఏ వైపు నుంచైనా సమయాన్ని చూసుకోవచ్చు. ఈ వాచీ బాడీని స్టీల్ తో కాకుండా, సిలికాన్ తో తయారు చేశారు. అందువల్ల దీని బరువు మామూలు వాచీలతో పోల్చుకుంటే నాలుగు రెట్లు తగ్గింది. దీనిలో మెరుగైన టార్బిలాన్ మెకానిజంను వినియోగించారట. దీని తయారీలో 590 విడిభాగాలు ఉపయోగించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచీగా ఇది రికార్డులకెక్కింది.